బాబూ.. ఇది తగునా!!

Mon, 4 Jul 2016, IST    vv
బాబూ.. ఇది తగునా!!

విశాలాంధ్ర - విజయవాడ :

వెనుకటికి ఎవరో ఒకతను 'రోగం ముదిరింది రోకలి తలకు చుట్టండి' అన్నాడట', అచ్చం అలాగే ఉంది మన పాలకుల తీరు, పోలీసు అధికారుల అత్యుత్సాహం. ఇది చూస్తుంటే అసలు నిజంగా మనం ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నామా? లేక కరుడుగట్టిన నియంతృత్వ పాలనలో బతుకుతున్నామా? అన్న సందేహం కలుగక మానదు. బూర్జువా భూస్వామ్య వ్వవస్థకు కాలం చెల్లిపోయి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఏర్పడి, ప్రజా ప్రతినిధుల పాలన వచ్చినప్పటికీ, భూస్వామ్య పోకడలు కనుమరుగైనట్లు కనిపించడం లేదు. సోమవారం మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విజయవాడలో ఆయన విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అల్లూరి 119వ జయంతి సందర్భంగా విజయవాడలోని బుడమేరు వంతెన వద్దగల ఆయన విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమానికి నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఉదయం పదిన్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావాల్సిఉంది. కాని ఆయన మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాలేదు. (దాదాపు మూడు గంటలు ఆలస్యం) ఈ లోపు మన శాంతి - భద్రతా రక్షక భటులు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టి, ప్రజల రాకపోకలు స్తంభింపజేసి, అప్రకటిత కర్ఫ్యూ విధింపు వాతావరణం సృష్టించారు. సీఎం వచ్చి విగ్రహానికి నివాళులర్పించి వెళ్ళే వరకు ఇతరులెవ్వరూ ఆ విగ్రహం వద్దకు వెళ్ళకూడదని, నివాళులర్పించరాదని ఆంక్షలు విధించారు. 11.30 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. దుర్గాభవాని, తదితరులు అల్లూరికి నివాళులర్పించేందుకు బుడమేరు వంతెన వద్దకు వెళ్ళారు. పోలీసుల హడావుడి, ట్రాఫిక్‌ జామ్‌, ప్రజల ఇబ్బందులు, వంతెనకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయి, ఆ ప్రదేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దాంతో వారు గంట సేపు వేచి చూశారు. 12.30 గంటల వరకూ కూడా సీఎం రాలేదు. దీంతో సీపీఐ, దళిత సంఘాల నాయకులు, ప్రజలు ఓపిక నశించడంతో పోలీసులను నిలదీయగా, సీఎం వచ్చి వెళ్ళే వరకు ఎవ్వరూ ముందుకు వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఇదంతా చూస్తే పూర్వపు కాలంలో గ్రామాల్లో ముందుగా ఆ గ్రామంలోని మోతుబరి వచ్చి, దేవాలయంలో దర్శనం చేసుకునే వరకు గ్రామ ప్రజలెవరినీ పూజారులు అనుమతించని రీతిగా ఉంది. ఇక్కడ పూజారుల పాత్రను పోలీసులు పోషించారు.

సీఎం సమయ పాలన పాటించాలిగాని గంటల తరబడి ఆలస్యంగా రావడం, అదీ విజయవాడలోనే ఉండి ప్రజల్ని ఇబ్బందులకు ఉరి చేయడం సముచితం కాదు. ఇలా చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా నగరంలోని రామవరప్పాడు రింగ్‌ సెంటర్‌లోగల బాబూజగ్జీవన్‌రామ్‌, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించే కార్యక్రమాలకు కూడా సీఎం గంటలతరబడి ఆలస్యంగా వచ్చి, ప్రజల సహనాన్ని పరీక్షించారు. ఇటీవల కాలంలో ఇది మూడో సంఘటన.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమయపాలన పాటించకుండా ప్రజల్ని ఇబ్బందుపాలు చేయడం భావ్యం కాదన్నారు. ఈ చర్య జాతి నేతలను అవమానించడమేనని, దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు.

అనంతరం విగ్రహం వద్దకు వెళ్లేందుకు పోలీసులు అడ్డగించి, అభ్యంతరం చెప్పడంతో సీఎం వచ్చి వెళ్ళాకే నివాళులర్పిస్తామని, రామకృష్ణతోసహా తదితర నాయకులు వెనుతిరిగారు. వెనుతిరిగిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుని పాయకాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన సీపీఐ నేతలను తక్షణమే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈలోగా ముఖ్యమంత్రి రావడం, అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి వెళ్ళడం జరిగింది. అనంతరం సీపీఐ నేతలను పోలీసులు విడుదల చేశారు. అనంతరం వారు నగరంలోకి వస్తూ అల్లూరి సీతారామరామరాజు విగ్రహానికి నివాళులర్పించారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో రామకృష్ణ, శంకర్‌, దుర్గాభవానీసహా నగర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ శ్రీనివాస్‌, నగర కార్యవర్గ సభ్యులు అప్పురుబోతు రాము, కేవీ భాస్కరరావు, నగర మహిళా సమాఖ్య కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, ఎఐవైఎఫ్‌ నగర కార్యదర్శి బొక్కా ప్రభాకర్‌, ఎఐఎస్‌ఎఫ్‌ నగర కార్యదర్శి సీహెచ్‌ రఘువీర్‌, సీపీఐ నాయకులు జాడా పెద్దిరాజు, చీకటి సైదారావు, చరణ్‌ సాయి, లోకేష్‌ బాబు, క్రాంతికుమార్‌ తదితరులు ఉన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

తాజావార్తలు లో మరికొన్ని

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు