వాత్సల్యం

Sat, 9 Jan 2016, IST    vv

వాత్సల్యం... ఈ జీవ ప్రపంచాన్ని నడిపే ఇంధనం, ప్రాణశక్తి. వరిచేలపై నుంచి వెళుతూ గాలి సుతారంగా పలకరించినప్పుడు అలల సోయగమై తలూపే పచ్చని ప్రేమామృత దృశ్యమై మన గుండెల్ని స్పర్శించే తీయని అనుభూతి. కొండకోనల్ని ఒరుసుకుంటూ గలగల పారే సెలయేటి లయాత్మక సవ్వడి మన వీనుల విందై మరో లోకంలో విహరింపచేసే అంతరంగ ఆనందాంబుధి. శీతవేళ తెలిమంచు బిందు వులే ముత్యాల హారంగా ధరించి మురిసిపోయే, మెరిసిపోయే ప్రకృతి కాంత కవ్వింపు కన్నుల పండగై మన తనువు తటిల్లతై పొందే తన్మయానుభవం. ఈ విశ్వమంతా వాత్సల్యమే. చెట్టూపుట్టా పిట్టాగుట్టా నింగీనేలా అణువణువూ వాత్సల్యపు విలాసమే. ఇన్ని లక్షల జీవరాశుల్ని, కోటానుకోట్ల వృక్షజాతుల్ని పరస్పర సహజీవన వలయంగా మార్చిన మహౌన్నత శక్తితరంగిణి ఈ వాత్సల్యమే. పుడమి గర్భం చీల్చుకొచ్చే అంకురానికి వాయువు, వెలుతురులు వెయ్యి చేతులు సాచి ఆప్యాయానురాగాలందిస్తూ తమ పొత్తిళ్లలో పొదువుకునే అనుబంధమే వాత్సల్యం.

గుండె ద్రవించితే ఏరులై పారడం, ప్రేమామృతం ఒలికితే పాటై ప్రవహించడం, కరుణ కడలై పొంగితే మమతానురాగమై స్పర్శించడం..ఇదే వాత్సల్యం. కన్నబిడ్డ స్పర్శతో ప్రసూతి బాధంతా ఆత్మీయతాగీతంగా మారిపోవడమే వాత్సల్యం. అది భౌతికం, అంతరంగం. లాక్షణికులు ఏమని నిర్వచించినా.. అది పదార్థంలా మార్పు చెందుతుందే తప్ప మరణమెరుగదు. దగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు.. ఇలాంటి వాటి వేటికీ చలించదు, సన్నగిల్లదు. అందువల్లనేమో కుత్సితాలు, కుట్రలు, కూహకాలతో మనిషి జీవితం నిండిపోతున్నా.. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ వసివాడకుండా అమ్మ ప్రేమ అజరామరమై అమరత్వం పొందుతోంది. బుడిబుడి అడుగుల బిడ్డ చిటికెనవేలు పట్టుకొని ప్రపంచం వాకిట్లోకి నడిపిస్తూ బతుకుదారి చూపించే నాన్న కూడా వాత్సల్యపు రూపే. అమ్మ ఎంత అదృష్టవంతురాలు! అంతా ఆమె సొంతమే!! ఆమె అనుభవించి, ఆనందించి వదిలేసిన చిట్టచివరి ఆత్మీయ చుక్కే నాన్నకు దక్కు. పిచ్చి తండ్రి.. దానికే ఎంత పొంగిపోతాడు. ఎంత పొగరుపోతాడు. అంతా తానే నడిపిస్తున్నానని, తను గీసిందే గీత, రాసిందే రాత, పంచిందే ప్రేమ అనుకొని పొంగిపోతాడు. అంతా అమ్మదేనని, ఆమెదేనని ఎప్పటికైనా తెలుసుకుంటాడా.. నిజంగా, ఆ రహస్యం తెలిస్తే అదే అతని ఆఖరి చిరునామా అయిపోదూ!. ఈ జీవపరిణామం ఆగిపోదూ!! అతన్ని అలానే వాత్సల్యపు భ్రమల్లో బతకనిద్దాం. అమ్మ వాత్సల్యంలో ఓ స్వార్థం ఉంది. ప్రకృతిలోనే ఈ స్వార్థం దాగి ఉంది. ఇది నా బిడ్డ, ఇది నా సంతతి అనే సహజమైన వాత్సల్యం ఆమెది. ప్రకృతిలో, సంస్కృతిలో జీవగతమైన విలక్షణం ఆమెది. కాకిపిల్ల కాకికి ముద్దు అంటారు అందుకే. నాన్న వాత్సల్యం స్వార్థం కాదు, నమ్మకమే పునాదిగా సాగు తుంది. తన బిడ్డ అని తెలవగానే నిలువునా నీరయ్యే లక్షణం నాన్నది. బిడ్డకు కష్టం ఎదురైనప్పుడు నేనున్నానంటూ సాంత్వన వచనమై, ధైర్య ప్రవచనమై నిలిచే వాత్సల్యం నాన్నది. పసితనపు ప్రేమానుభూతులన్నీ అమ్మకే సొంతం. చిలిపిచేష్టలు, అల్లరి గోలలే తండ్రి గుండెలమాటున దాచుకొని నెమరువేసుకొనే బిడ్డ తీపి గురుతులు. తెలుగుదనపు కమ్మదనం తెలుసు, కన్నకడుపుల తీపిదనమూ తెలుసు అంటూ ఎర్రాప్రెగడ హరివంశంలో బాలకృష్ణుడి గురించి వర్ణిస్తాడు. బిడ్డ అడుగులు వేస్తుంటే తండ్రి గుండెల్లో ఎంతటి అలజడి మొదలవుందో, తన ప్రతిరూపునకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి, అందుకు ఇప్పటినుంచే తానేం చేయాలి అని ఎంత మధనపడుతాడో ఏ కవి రాయలేదే! కవులెవ్వరికీ ఆ ఆందోళన కలగలేదా!? బిడ్డలందరూ అమ్మకిచ్చే ప్రాధాన్యత నాన్నకు ఎందుకు ఇవ్వరో!? ఎప్పుడో ద్వాపరయుగంలో రాముడు ఇచ్చాడని ఉదాహరణగా చెప్పుకోవడమేగానీ, ఇవాళ నూటికికోటికి ఒక్క రాముడు కూడా కనిపించడంలేదు. ఏదిఏమైనా వత్సల రూపానికి, వాత్సల్యరాగానికి పట్టుగొమ్మగా నిలిచేది జీవతత్వమే. మనిషితనంలో అది మరింత పరిణితి పొందింది. మనిషితనమంటేనే వాత్సల్యపు ప్రతిరూపం. పసితనంలో అమ్మనాన్నలు పెట్టే ముద్దులోనే వాత్సల్యం ముద్దకట్టుకొంటోంది. నాన్నకు లేని అదృష్టం అమ్మకు ఉంది. 'అలసితివి కదన్న! యా కొంటివి కదన్న/ మంచి అన్న! ఏడ్పు మనుమన్న' అంటూ చిన్ని కృష్ణుడికి యశోద పాలిస్తూ సముదాయించడాన్ని పోతన రూపుకట్టాడు. బిడ్డలకు పసితనంలో అమ్మలు పంచిన ఆ ప్రేమామృతమే జీవితాంతం గుర్తుండిపోతుందేమో! కొడుకా అనీ, చిట్టీ అనీ, నా బంగారం అనీ, నాన్నా అనీ, ఈ రోజుల్లో అయితే పింకీ, మంకీ అని కొడుకులను రకరకాలుగా ముద్దుచేస్తారు! పెరిగి పెద్దవుతున్న వేళ తండ్రులు ఎంత వాత్సల్యవృష్టి కురిపించినా దాని ముందు దిగదుడుపేనేమో! అందుకేనేమో మన కవులు కూడా పసితనాన్ని వర్ణించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 'ముద్దుగారే యశోద ముంగిట ముత్యం'గా బాలకృష్ణుడ్ని అన్నమాచార్యులు వర్ణించారు. శ్రీకృష్ణకర్ణామృతం రాసిన లీలాశుకుడు 'ప్రాత:స్మరామి దధి ఘోష వినీత నిద్రం/ నిద్రావసాన రమణీయ ముఖారవిందం!' అంటాడు. వేకువజామునే పెరుగు చిలికే సవ్వడి.. దానికి మేల్కొన్న ముద్దు ముఖం..దానిలో చిరుదరహాసం అని అర్థం. అమ్మ పెరుగు చిలికితే వెన్న వస్తుంది. అమ్మచేతి వెన్నముద్ద నోటికి వస్తుందని ఆ ఆనందంలోని అసలు రహస్యం. బిడ్డ ఎంత మట్టిలో పొర్లాడినా అమ్మకు అసహ్యం పుట్టదు.. అందులోనూ బిడ్డలో కొత్త అందం చూస్తుందని నారాయణ తీర్థులు కృష్ణలీలా తరంగంలో 'కంకణ కేయూర భూష- కనక కింకిణీకృత బహుఘోష/కుంకుమ పంకిలవేష- కుటిల కుంతల గోకుల భూష!' అని పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ 'తల్లి మురిపెం తనివి తీరనిది!' అన్నారు.

వాత్సల్యం అంటే కేవలం బిడ్డకు తల్లిదండ్రులు అందించేది మాత్రమే కాదు. తమ్ముడికి అక్క, చెల్లికి అన్న అందించే వాత్సల్యమూ తూకము వేయలేనిదే. దీనిలో నిర్మలత్వం ఉంటుంది. స్నేహితుడికి మరో స్నేహితుడు అందించే వాత్సల్యంలో నిష్కల్మషత్వం ఉంటుంది. దైన్యంలో, ఆపదలో, నిస్సహాయతలో ఉన్నవారికి తోటి మనిషి అందించే చేయూతలోనూ అనిర్వచనీ యమైన వాత్సల్యం దాగి ఉంటుంది. శకుంతలను కన్నబిడ్డగా సాకిన కణ్వుని అంతరంగం వాత్సల్యతరంగమే! ఆకలితో అలమటించే అన్నార్తులకు ఆపన్న హస్తం అందించి ఆదుకో వడంలో పరిపూర్ణమైన వాత్సల్యం పొంగిపొర్లుతుంది. ఎదుటి మనిషి కన్నీటిని తుడిచే ఆ హస్త స్పర్శ వాత్సల్య రసామృతమే. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా అన్నంపెట్టడమే దైవత్వం అన్నారు వివేకానంద. వాత్సల్యంతో చేసే ఏ పనైనా దైవత్వానికి మించిందే. దైవం భావన ఓ భ్రమపూరితం. వాత్సల్యం అనేది వాస్తవం. ఈ దేశానికి మొదటి శత్రువు మతం అన్నారు. మతం.. లేని దేవుడ్ని ఉన్నట్లు ప్రజల్ని భ్రమింపచేస్తుంది. 'మతాలు కొన్ని లక్షల ప్రాణాలను బలిపుచ్చుకున్నాయి.' అని మరో రచయిత ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవాన్ని విడిచిపెట్టి ఎండమావుల వెంట పరుగెత్తితే మారణహౌమమే మిగులుతుంది.

దైవం మనిషిలోని వాత్సల్యాన్ని తుంచేసింది. అందువల్లే ఈ దేశంలో మతోన్మాదం బుసలు కొడుతోంది. మధ్యప్రాచ్యంలో మతవిషనాగులు దేశాలకు దేశాలనే కాటువేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా తన పెత్తనం కోసం దేశాల మధ్య వైషమ్యాల అగ్గి రాజేస్తోంది. ప్రేమను పంచాల్సిన మనిషి విద్వేషాన్ని, విధ్వంసాన్ని వెదజల్లుతున్నాడు. 'కోటి గ్రంథాల సారాంశాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్పగలను. అదేమిటంటే-పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం' అన్నాడు కవి కులగురువు కాళిదాసు. 'పరోపకారార్థమిదమ్‌ శరీరమ్‌' అన్నారు గదా! ఇలా మనిషి జీవించాలంటే వాత్సల్యం ఉచ్ఛ్వాసనిశ్వాసలు కావాలి. కుటుంబంలోనే కాదు, సమాజంలో సౌభ్రాతృత్వ భావన వెల్లివిరియడానికీ, మనసున విశాల దృక్పథం పెంపొందడానికీ, మనుషుల మధ్య పరస్పర వాత్సల్యం పెనవేసు కోవాలి. 'జీవితం కరిగిపోయే మంచు/ ఉన్నదాంట్లోనే నలుగురికీ పంచు' అన్న కవి వాక్కు నిజం కావాలంటే ప్రతి మనిషి మనస్సు వాత్సల్యపు లత లల్లుకోవాలి. తలపుల్లో పువ్వులు వెల్లివిరియాలి. వాత్సల్యం కేవలం బాల్యపు అలంకారమే కాదు, కుటుంబాన్ని కలిపి ఉంచే ఆభరణమే కాదు. సమాజాన్ని, దేశాలను చివరకు ఈ ప్రపంచాన్ని శాంతి, సుస్థిరతల ఉద్యానవనంగా మార్చే అద్భుత శక్తి. ప్రతి ఇల్లూ ముందుగా వాత్సల్యపు చిరునామాగా మారాలి. ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు వాత్సల్యం అనే గుణగణాలను అందించాలి. ప్రతి బిడ్డా.. తన తల్లిదండ్రులకు వాత్సల్యపు కానుకగా మారాలి. అప్పుడే వాత్సల్యం జీవిత రసామృతమే కాదు, స్వేదామృతంగా, జనజీవనామృతంగా మారుతుంది. జగదానందకా రకమవుతుంది. జనశ్రేయో:దాయకమవుతుంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు