తెలుగు వెలుగులీనేనా!?

Sat, 16 Apr 2016, IST    vv
తెలుగు వెలుగులీనేనా!?

మన భాష మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు?... మన అక్షరాలు మన పిల్లలు దిద్దకపోతే, రాయకపోతే ఎవరు రాస్తారు?... మన సాహిత్యం మనం చదవకపోతే, కాపాడు కోపోతే ఎవరు ఆ పనిచేస్తారు?... మన అమ్మను మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు?... తెలుగు భాష నేడు ఎదుర్కొంటున్న విపరిణామాలకు బాధ్యత ఎవరిది? ఈ లోపాలను సరిదిద్దుకొని ఉపాధితో భాషను అనుసంధానం చేసుకోవాలి. నేడు తెలుగు భాష గురించి మన పెద్దలు, పండితులు, రచయితలు తీవ్ర మదనపడుతున్నారు. దీనిపై చర్చలు జరుపుతున్నారు. సోషల్‌ మీడియాలో రకరకాల తెలుగు పదాలు సృష్టించి జనం మీదకు వదులుతున్నారు. ప్రతి పదానికీ తెలుగు పదం సృష్టించాలన్న తపన వారిలో కనిపిస్తోంది. తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యాన్ని ఈ ఆందోళన మనకు గుర్తు చేస్తోంది. అయితే ఇటువంటి వారి చిత్తశుద్ధి ఏమిటన్నది ఓ ప్రశ్నగా మిగులుతోంది. ఎందుకంటే, గొంతులు చిచ్చుకొనే వారెవరూ తమ బిడ్డలకు తెలుగు నేర్పడంలో ఆసక్తి చూపడంలేదని ఇటీవల ఓ సర్వేలో తేలిపోయింది.

ఏ బిడ్డయినా భూమ్మీద పడగానే చూసేది అమ్మ మొహమే. ముందుగా పలికేది అమ్మ అనే కమ్మని పలుకే. బిడ్డ ఎదుగుదలకు అమ్మ పాలెంత అవసరమో, వికాసానికి అమ్మ భాష అంత అవశ్యం. ఏ భాష అయినా మాతృభాష తర్వాతే.. ఏ మాట అయినా తెలుగు మాట తర్వాతే. శతాబ్దాలనాడే మన అజంతాల భాష దిగంతాలకు వ్యాపించిన చరిత్రను ప్రోదిచేసుకుంది. ఏ భాషా పదాన్నైనా సులువుగా తన సొం తం చేసుకునే సత్తా, సౌలభ్యం ఉంది కాబట్టే హాల్డెన్‌ దొర 'ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌' అని ఆకాశానికెత్తాడు. తొలినాళ్లలో సంస్కృత ప్రాకృతాలను ఇముడ్చుకొంది. ఆ తర్వాత ఉర్దూ, హిందీ ఇప్పుడు ఆంగ్ల పదాలను అరాయించుకొంటోంది. ఇంతటి గొప్ప వారసత్వం, చరిత్ర కలిగిన మనం నేడేం చేస్తున్నాం. తెలుగు వాక్యాన్నే ప్రమాదంలోకి నెట్టేస్తున్నాం. తెలుగు వాక్యం, తెలుగుదనం పొగొట్టుకుంటే మన సంస్కృతి, ఉనికికే చిల్లు, చెల్లు పెట్టుకోనే ప్రమాదాన్ని కొనితెచ్చు కోవడమేనన్న స్పృహ మరచిపోతున్నాం. పరభాషా పదాలను తనలో మిళితం చేసుకొని సంపద్వంతమైన తెలుగు నేడు తన వాక్యానికి తుదివాక్యం పలికే ముప్పులో పడుతోంది. మన యువతరం మాటల్లో పూర్తిగా తెంగ్లీషు (అన్నీ ఇంగ్లీషు పదాలే మధ్యలోనో, చివర్లోనే తెలుగు పదం కలుపుతారు.) వాక్యాలే వినిపిస్తాయి. 'నేను టీవీ వాచ్‌ చేస్తూ టైమ్‌ స్పెండ్‌ చేస్తానండీ', 'నాకు కుకింగ్‌ అంటే లైకింగ్‌ అండీ', 'నాకు రీడింగ్‌ హాబిట్‌ కన్నా క్రికెట్‌ ప్లేయింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌ అండీ'. ఇదీ నేటి మన యువతీయువకుల సంభాషణ తీరు.

మన టీవీ యాంకర్లు (వంకర్లు) భాషను కూనిరాగాలతో ఖూనీ చేస్తున్నారు. మీడియా చాలా శక్తిమంతమైంది. దాని ప్రభావం పల్లెల్లోని మహిళలపై కూడా పనిచేస్తోంది. దీనివల్ల భాష సంపద్వంతం కావడం మాట అటుంచి సంకరీకరణకు, నిస్సారీకరణకు గురిచేస్తున్నాం. ఈ విపరిణామానికి తెలుగు భాషా సంరక్షణోద్యమకారులను, పాలకులను నిందించాల్సిందే. గిడుగువారు వ్యావహారిక భాషా ఉద్యమానికి జీవితాన్ని ధారపోశారు కాబట్టి సరిపోయింది.. లేదంటే అరసున్నాలు, శకటరేఫలు, సంధి విగ్రహాలతో జీడిపాకంలా లాక్కోవాల్సి వచ్చేది.. ఈ మాత్రం కూడా భాషా వికాసం జరిగి ఉండేది కాదేమో!

భాషను.. సాహిత్యానికి, కవిత్వానికి పరిమితం చేస్తే ఆ భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగినవారూ సామాజికంగా వెనుకబాటుకు గురవుతారు. దీంతో వారు వేరే భాషల వైపునకు మళ్లుతారు. భాషను ఉపాధితో ముడిపెట్టాలన్న వాస్తవాన్ని ఆధునిక కాలంలో మనం పూర్తిగా విస్మరించాం. 'చదువది యెంత గలిగిన రసజ్ఞత నించుక చాలకున్న ఆ చదువు నిరర్థకం' అన్నారు భాస్కర శతకకారుడు. అంటే ఇక్కడ రసజ్ఞతకు అర్థం ఇప్పటి అవసరానికి అనుగుణంగా మనం మార్చి చెప్పుకోవాల్సిందే. రసజ్ఞత అంటే ఉపాధి అందించడంగా చదువుకోవాలి. ఇలా చూసినప్పుడు మన చదువులు నిరర్థకమని తేలిపోతోంది. రాచరిక వ్యవస్థలో పుట్టుకొచ్చిన మన కావ్యా లన్నీ(ఒకటోరెండో మినహాయింపు ఉండవచ్చు) ఉపాధి పునాదిగానేనన్న వాస్తవాన్ని విస్మరించరాదు. పోషకులు లేకుండా పండితులు తయారుకాలేదన్నది చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా పచ్చినిజం.

మధ్యయుగాల్లో రాజాస్థానాలే మన సాహిత్య కార్యస్థలిగా వర్ధిల్లిన విషయాన్ని గుర్తించాలి. ఆధునిక కాలంలో ఉద్యమ ప్రభావాలతో సాహిత్యం, భాష వర్ధిల్లాయి. స్వాతంత్య్రానంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మరీ ముఖ్యంగా తొంభైయ్యో దశకం నుంచి జనం ముఖ్యంగా యువత ఉపాధి కోసం పరుగులు తీయడం మొదలుపెట్టారు. తెలుగు భాష వారికి ఉపాధికి మార్గం చూపలేక పోయింది. అందుకు ఆంగ్లమే ఏకైక మార్గంగా మారింది. ఫలితంగానే తెలుగు భాష నేడీ దుస్థితిని ఎదుర్కొనాల్సి వస్తోంది. మన పాలకులు, భాషోద్యమ కారులు తెలుగు భాష అభివృద్ధి విషయంలో మొసలి కన్నీరు కార్చడం, వేదిక దొరికినప్పుడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మినహా చేసిందేమీ లేదు. భాష విషయంలో స్పష్టమైన, ప్రయోజనకరమైన విధాన నిర్ణయాలేవీ చేయలేకపోయారు. అంతే కాదు, కార్పొరేట్‌ కాలేజీలను ప్రోత్సహిస్తూ అబద్ధపు సంస్కృత బోధ నకు ఊతమిస్తూ విద్యార్థుల్లో మాతృభా షాద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇలా ప్రజాద్రోహానికి, మాతృభాషాద్రోహానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన భాషా విధానం ఫలితమే ఇదంతా. దీన్ని నిలదీసిన భాషోద్యమకారుడే కరవయ్యాడు. సన్మానాలు, సత్కారాలతో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. భాషను ఆధునిక శాస్త్ర సాంకేతిక పదాలతో పురిపుష్టం చేసినప్పుడే.. ఆ భాషలో చదివే చదువులు ఉపాధి చూపుతాయనే వాస్తవాన్ని మన పాలకులు, భాషావేత్తలు ఒంటపట్టించుకునే దాఖలాల్లేవు. కొత్తగా వచ్చే పరిజ్ఞానానికి సంబంధించిన అన్ని పదాలకు మాతృభాషలో సమానార్థకాలను తయారుచేసి స్థిరీకరిస్తే విజ్ఞానం విద్యార్థి మెదడులోకి సవ్యంగా ఎక్కుతుంది.

ప్రపంచంలో ఏ మూలన కొత్త శాస్త్రసాంకేతిక ఆవిష్కరణలు జరిగినా వాటికి సంబంధించిన పదాలను మాతృభాషలోకి తర్జుమా చేసేందుకు జర్మనీలో ఒక ప్రభుత్వ విభాగమే ఉంది. ఆ పదాలను అక్కడి పత్రికలు ఉపయోగిస్తుంటాయి. దీంతో ఆ పదాలు వాడుకలోకి వస్తున్నాయి. స్వభాషాభిమానానికి, స్వాభిమానానికి మారుపేరుగా చెప్పదగిన స్వీడన్‌లో ఏ ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన పదాలనైనా వెంటనే తమ భాషలోకి తర్జుమా చేసుకుంటారు. గత కొద్ది సంవత్సరాల క్రితం ఆ దేశంలో ఆయుర్వేద వైద్య కళాశాలను ప్రారంభించారు. ఆ వైద్య పరిభాషను ఆంగ్లం నుంచి కాకుండా సంస్కృతం నుంచే నేరుగా వారు స్వీడన్‌ భాషలోకి అనువదించుకున్నారు. ఆ దేశ జనాభా మన రెండు తెలుగు రాష్ట్రాల జనాభాలో పదింట ఒకవంతు ఉంటుంది. దానిలో ఎంతమంది ఆయుర్వేదం చదువుతారు? ఆ కొద్దిమంది కోసం ఎంతో శ్రమకోర్చి, ఖర్చుపెట్టి తర్జుమా అవసరమా? అని స్వీడన్‌ ప్రభుత్వం ఆలోచించలేదు. వాళ్ల మాతృభాషాభిమానం అటువంటిది..అందుకే వారు సమగ్రాభివృద్ధి సాధించగలుగుతున్నారు. అంత చిన్న దేశానికి వీలుకలిగిన పని మనకు సాధ్యం కాదా? అంటే మన చిత్తశుద్ధిలోపమే ప్రధాన కారణం.

మనకు తెలుగు భాషకు సంబంధించి ప్రభుత్వపరంగా విద్యాశాఖ, అధికార భాషా సంఘం పనిచేస్తుంటాయి. మధ్యలో తెలుగు అకాడమీ కూడా ఉంది. దశాబ్దాలుగా ఇవి చేస్తున్న కంటితుడుపు నిర్ణయాలు, చిత్తశుద్ధిలేని చర్యల ఫలితంగానే నేడు భాష గురించి ఇంతగా ఆందో ళనకు గురికావాల్సి వస్తోంది. ఇప్పటికైనా మాతృభాష విషయంలో పాలకులు అనుసరిస్తున్న లోపాలేమిటో గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితికి హేతువులేమిటో నిగ్గుతేల్చాలి. ఉపాధితో అనుసంధానం చేస్తూ భాషాభివృద్ధికి దోహదపడే విధానాన్ని రూపొందించాలి. సంప్రదాయ సౌరభం కోల్పోకుండా, ఆధునిక ప్రయోజనాలు సాధించగల సరికొత్త తెలుగు భాషా వ్యవస్థను రూపొందించుకోవాలి. ఉపాధినిచ్చే సత్తువ భాషకు చేకూర్చితే తెలుగుకు మళ్లీ ప్రజాదరణ, సామాజిక ప్రతిష్ఠ పెరుగుతాయి. ఉత్తమ సాహిత్యమూ పరిఢవిల్లుతుంది. కంప్యూటరీ కరణకు అచ్చుగుద్దినట్లు అమరే ఏకైక భారతీయ భాష తెలుగు లిపే. అంతేకాదు భావ వేగాన్ని సమర్థంగా అందిపుచ్చుకోవడంలో రోమన్‌వంటి యూరోపియన్‌ భాషలతోనే కాక మన దేవనాగరి లిపితోనూ పోటీలో ముందంజ వేసేది తేనెలొలుకు తీయని తెలుగు భాషేనని ఇటీవల కాలంలో సైన్స్‌టుడేలోని ఓ వ్యాసం తేల్చిచెప్పింది. కాబట్టి మనికిప్పుడు కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం.. అంతకు మించి చిత్తశుద్ధి, సంకల్ప బలం. తల్లిపేగు ప్రాణధార, తల్లిభాష జ్ఞానధారగా ఎంచుకొని ముందుకుసాగుదాం.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు