సినిమా పాటలు - శ్రీశ్రీ

Sun, 3 Mar 2013, IST    vv

తెలుగు సినిమా రంగంలో టాకీయుగం ప్రారంభమైనప్పటి నుండి సుప్రసిద్ధ కవులు సినిమాలకు రచన చేస్తూ వచ్చారు. తాపీ ధర్మారావు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, పింగళి నాగేంద్రరావు, దాశరధి, సి.నారాయణరెడ్డి వంటి సుప్రసిద్ధులు వ్యాపార సినిమా రంగంలో అనేక పరిమితులకు లోబడి కూడా ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించారు.

సాహిత్యవేత్తలుగా పెద్దగా పేరులేని సముద్రాల, సదాశివబ్రహ్మం, తోలేటి, సముద్రాల జూనియర్‌, వేటూరి సుందర రామమూర్తి కూడా రసవంతమైన రచనలు చేశారు.

విశ్వనాథ, చలం, కొడవటిగంటి, గోపీచంద్‌, రంగనాయకమ్మ సినిమా రంగంలో ఇమడలేక తమ భావప్రకటనకు సాహిత్యమే తగినదని తలచారు.

1930-40 సంవత్సరాలమధ్య శ్రీశ్రీజీవిక కోసం అనేకవృత్తులను ఆశ్రయించారు. దేని లోనూ ఇమడలేకపోయారు. మద్రాసు చేరుకొని 'ఆనందవాణి' పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేరారు.

1948లో 'నీర్‌ఔర్‌నందా'అనే హిందీ చిత్రాన్ని తెలుగులోకి డబ్‌ చేయటంలో రచయితగా శ్రీశ్రీ సినిమారంగ ప్రవేశం చేశారు. తెలుగులో ఈ సినిమా పేరు 'ఆహుతి'. ఆర్థికంగా ఈ సినిమా విజయం సాధించలేదు. అయినా రచయితగా శ్రీశ్రీకి గుర్తింపు వచ్చింది. సుప్రసిద్ధ దర్శకులు హెచ్‌. ఎం.రెడ్డిగారు 'నిర్దోషి' చిత్రానికి మాటలు, పాటల రచయితగా శ్రీశ్రీకి అవకాశం ఇచ్చారు. అప్పటినుండి మరణించే వరకూ (1983) శ్రీశ్రీ సినిమా రచయితగా గడిపారు.

శ్రీశ్రీ 100 చిత్రాలకుపైగా పాటలు రాశారు. డబ్బింగ్‌ సినిమాలకు మాటలు, పాటల రచన శ్రీశ్రీ ఆర్థికంగా నిలదొక్కు కోవటానికి ఉపయోగపడింది.

శ్రీశ్రీ రాసిన సినిమా పాటలన్నీ రసవంత మైనవని చెప్పటానికి వీల్లేదు. సన్నివేశానికి అనుగుణంగా రాసినవి కూడా ఉన్నాయి. కాని 'పాడవోయి భారతీయుడా! మానవుడిల మహానుభావుడే, తెలుగువీర లేవరా!' అనేవి చాలు శ్రీశ్రీని సినిమా సాహిత్యంలో మహోజ్వల తారగా నిలబెట్టటానికి.

సినిమాలలో సన్నివేశానికి అనుగుణంగా పాటలు రాసినా సాహిత్య విలువలను కోల్పోని ఏకైక కవి కృష్ణశాస్త్రి. అభ్యుదయ భావవ్యాప్తిలో శ్రీశ్రీని మించిన సినిమా కవి ఎవరూ లేరు.

'ఉన్నవారికే అన్ని సుఖాలోరయ్యోరయ్యో / లేనివారి గతి యీ లోకంలో నుయ్యో గొయ్యో' (పెంపుడుకొడుకు).

'మానవుడే సర్వశక్తి ధాముడు కాదా/మానవుడిల మహానుభావుడే చూడగా/ మానవుడే తలచినచో / గిరుల నెగురవేయడా / మానవుడె తలచినచో / నదుల గతుల మార్చడా / మానవుడే సృష్టికలంకారం' (గాంధారి గర్వభంగం)

'పాడవోయి భారతీయుడా! / ఆడి / పాడవోయి విజయగీతికా!' (వెలుగునీడలు)

సాధారణంగా సినిమా పాటలను ప్రజలు తలచుకొనేది కొద్దికాలమే. కాని కాలానికెదురీది దశాబ్దాలుగా ప్రజలు తలచుకొనే చాలా పాటలు శ్రీశ్రీ రచించారు.

అభ్యుదయ భావాలు, దేశభక్తి పెంపొందించే పాటలేగాక శ్రీశ్రీ కమనీయమైన జావళీలు, ప్రేమగీతాలు, హాస్యగీతాలు కూడా రచించారు.

పెట్టుబడిదారీవ్యవస్థలో అన్నిటిలాగే సినిమాకూడా వ్యాపారమే. సినిమాల ద్వారా శ్రీశ్రీ చాలాడబ్బు సంపాదించారు. కాని తన వ్యసనాలకు డబ్బు ఖర్చుచేసి ఆర్థికంగా ఇబ్బందులు కూడా పడ్డారు.

'బెండయ్యగారి గది' 'తిక్కన', 'ఆకలిమంటలు' మొదలైన సినిమాలు తియ్యాలని అనుకుంటూ ఉండేవారు. కాని అవి కార్యరూపం దాల్చలేదు. తన ఆలోచనలకు కళారూపం ఇవ్వటంగాక, వ్యాపారపు సినిమాకు తన ఆలోచనలను విక్రయిస్తూ గడిపారు.

సినిమా రచయితలపై శ్రీశ్రీ ప్రభావం

శ్రీశ్రీ సినిమా పాటలను ఆరుద్ర, ఆత్రేయ, దాశరధి, సినారె, వేటూరి కొన్ని పాటలలో అనుకరించారు.

'కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదానా!/ బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్ప గలవా?' అనే పాట శ్రీశ్రీ రచనగా చాలా మంది అనుకున్నారు. ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు కూడా అలాగే తలచారు. ఇది ఆత్రేయ రచన.

మంచి కవిత్వపు పంక్తులను తనవేగాక ఇతరులవి కూడా సినిమా పాటలలో శ్రీశ్రీ చేర్చారు. కరుణశ్రీ పద్యం 'ఫెళ్లుమనె విల్లు'ను 'వాగ్దానం' సినిమాలో ఒక హరికథలో జొప్పించారు. శ్రీనాథుడి పద్యం 'సొగసు కీల్జెడదానా సోగ కన్నులదాన'ను 'ౖబొబ్బిలియుద్ధం' చిత్రంలో తన పాట 'మురిపించే అందాలే'కు సాకీగా ఉప యోగించారు.

'మహాప్రస్థానం'గీతాలను సమర్థవంతంగా ఉపయోగించుకున్న సినిమా ఏదీ రాలేదు. శ్రీశ్రీతర్వాత ఒక గొప్ప 'మార్చింగ్‌ సాంగ్‌' శరీరం పులకించేలాగ, పిడికిలి బిగించే లాగ, సర్వ నాడులను ఉత్తేజపరిచేలాగ రాయగలిగిన కవి కన్పించటంలేదు.

- డా|| కె.రాజరామమోహన్‌రారు


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు