ప్రజా కళాభేరి-అన్న నల్లూరి

Sun, 24 May 2015, IST    vv
వల్లూరు శివప్రసాద్‌

'చూసినా, తాకినా, విన్నా, మాట్లాడినా మనస్సు కరిగిందా - అదిగో స్నేహం అంటే అదీ' ఇందుకు తెలుగునాట సజీవ సాక్ష్యం అన్న నల్లూరి....

కరణం, మునసబు, పటేల్‌, పట్వారీ మొత్తం గ్రామ పెత్తందారీవర్గం సామాన్య మానువుణ్ణి దోపిడీ చేస్తున్న వైనాన్ని 'భూభాగోతం' (వంగపండు రచించిన నృత్య నాటిక) లో ప్రదర్శిస్తున్న సందర్భంలో ఒక సాధారణ ప్రేక్షకుడు ఎంతో ఉద్రేకంతో వేదికపైకి పరుగునవచ్చి కరణం, మునసబు పాత్రధారులను చేతికర్రతో చితక బాదాడు. ఇది జరిగిన సంఘటన. భూస్వామ్య పెట్టుబడి దారీ వ్యవస్థపై జనసామాన్యంలో చైతన్యం కలిగించటా నికి కళాకారుడిగా 'అన్న' అహోరాత్రులు (కాదు, జీవితం మొత్తం) కృషి చేశారు. ప్రజావ్యతిరేక గ్రామీణ యంత్రాంగం రద్దుకావటంలో భూభాగోతాన్ని రాష్ట్ర వ్యాపితంగా వేలాది ప్రదర్శనలిచ్చిన ప్రజానాట్యమండలి ప్రభావం ఖచ్చితంగా ఉంది. దానికి నేతృత్వం వహించిన అన్న ఆ విజయసూత్రధారి.

భారతదేశంలో ప్రధానంగా తెలుగునేలమీద అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలి సాహిత్య సాంస్కృతిక రంగాలలో సాధించిన విజయాలు అపూర్వమైనవి. ప్రజల కళలు, సాహిత్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాయి. ప్రజాచైతన్యమే పరమలక్ష్యంగా పురోగమించాయి. సాంస్కృతిక పునర్వికాసానికి కృషిచేసి బలమైన ప్రజాసాంస్కృతికోద్యమాన్ని నిర్మించాయి. ఏడు దశాబ్దాలు చరిత్ర కలిగిన ప్రజానాట్యమండలికి కళ్లై కాళ్లై పర్యాయపదమై నిలిచిన వ్యక్తి, శక్తి నల్లూరి. 79 సంవత్సరాల జీవిత గమనంలో ఆరుపదులకు పైగా సాగిన అనన్య సామాన్యమైన కళాయాత్ర ఆయనది.

1948 నుంచి ఒంగోలు నగరజీవి అయినా ఇప్పటికీ గ్రామీణ అమాయకత్వం తనువంతటా ఉట్టిపడే ఈ పెద్దాయనది ప్రకాశం జిల్లా నరసాయపాలెం గ్రామం. అక్షరాస్యతకు దూరమైన మోతుబరి రైతు కుటుంబంలో కనకమ్మ, సుబ్బయ్య దంపతులకు ఆరూ ఆరూ ముప్ఫై ఆరున జన్మించిన నల్లూరి కూడా బడికి దూరంగా పెరిగాడు. తన ఊరికి దగ్గరలోని మారెళ్లగుంటపాలెంలో ఉండే కమ్యూనిస్టు నల్లూరి అంజయ్య పరిచయం, సాహ చర్యం, ప్రభావంతో 'కష్టాల్‌, నష్టాల్‌, కోపాల్‌, తాపాల్‌, శాపాల్‌ రానీ! వస్తేరానీ! తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ, రానీ రానీ!' అని అనుకుని తన జీవనమార్గాన్ని నిర్దేశించు కున్న ఈ 'కళారవి' అనేక కాంతులను వెదజల్లే సహృదయ, సదయ, సన్మార్గగామి 'మానవుడు'గా తెలుగు జాతి గుండెల్లో 'అన్న'గా నెలవైనాడు.

బొలినేని నాగభూషణం దర్శకత్వం వహించిన 'సత్య హరిశ్చంద్ర' నాటకంలో లోహితాస్యుడుగా నటనా జీవితాన్ని ప్రారంభించిన నల్లూరి నిస్తబ్దంగా ఉన్న ప్రజా నాట్యమండలికి ఊపిరులూది దాని అభివృద్ధికి తన శక్తి యుక్తులను ధారవోసినాడు. 1974లో ప్రజానాట్య మండలి పునర్నిర్మాణంలో నాయకపాత్ర వహించి గ్రామ గ్రామాన శాఖలను ఏర్పాటుచేసి దానికి జవజీవాలను కల్పించిన నిర్మాణదక్షుడు నల్లూరి. చలనచిత్రరంగానికి తరలివెళ్ళిన ఒకనాటి ప్రజానాట్యమండలి కార్యకర్తలను, తెలుగునాట చెల్లాచెదురుగా ఉన్న పాతతరం ప్రజాకళా కారులను, నవతరం కళాకారులను సమైక్యపరచిన ఘనత సహృదయుడైన నల్లూరికే దక్కింది. ప్రజానాట్య మండలిని తెలుగునాట ప్రతిగుండె ప్రతిధ్వనిగా మార్మో గించిన సృజనశీలి నల్లూరి.

వెనుకబడిన తనమే తన జననానికి ప్రేరణముగ ఆవిర్భవించిన ప్రకాశం జిల్లా అభివృదిష్ట్ర్ధకి కమ్యూనిస్టు నేతగా పథకాలను రూపొందించి ఉద్యమిస్తూనే మరో వైపు ఆ జిల్లాను రాష్ట్రంలోనే సాంస్కృతికరంగంలో అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లిన ప్రతిభాశాలి నల్లూరి. కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజాశ్రేణుల్లోకి తీసుకువెళ్లటా నికి సాంస్కృతికరంగాన్ని ఎన్నుకున్నారు నల్లూరి. 'తెనుగుతల్లి', అన్నా-చెల్లెలు, రుద్రవీణ, గాలివాన, పెత్తందారు, కొత్తబాట, మంచుతెర, ఛైర్మన్‌, పల్లెపడుచు తదితర నాటికలు, నాటకాలతో ప్రకాశంజిల్లా వాసులకు చేరువయ్యారు. యువతరానికి ఆశాజ్యోతి అయినారు. 'రత్తమ్మ మెస్‌'ను వేదికగా చేసుకొని విద్యార్థులను ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. పతాకం కిందకు చేరుస్తూ కళాప్రభం జనాన్ని ప్రకాశం జిల్లాలో సృష్టించిన వ్యక్తి నల్లూరి. మాదాల రంగారావు, టి. కృష్ణ, గిరిబాబు, బి. గోపాల్‌, నర్రా వెంకటేశ్వరరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పోకూరి బాబూరావు యింకా ఎందరో నల్లూరి సృష్టించిన తమ్ముళ్లే. అయితే వందేమాతరం శ్రీనివాస్‌ అనే సంగీతవేత్త నల్లూరికి తమ్ముడు కాదు-'కొడుకు'. తన గ్రామంలోని సాంఘిక అసమానతలను బాల్యంలోనే వ్యతిరేకించి ఉద్యమించిన నల్లూరి తరువాత తరువాత సామాజిక ఉద్యమకారుడిగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన తలెత్తాడు, ఎదిగాడు. అవిభక్త గుంటూరు జిల్లా యువజనసమాఖ్య కన్వీనరుగా, యువజనసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా యువతరంలో చైతన్యం కలిగించిన నల్లూరి 1974 నుంచి 1997 వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి కన్వీనర్‌, ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా విశేషసేవలం దించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సమితి కార్యవర్గ సభ్యునిగా బహు ముఖ సేవలందించిన శక్తిమంతుడు నల్లూరి. ఉత్తమ కమ్యూనిస్టు ఉత్తమ ప్రచారకుడు కావాలనే ప్రాధమిక సూత్రానికి నిలువెత్తు నిదర్శనం నల్లూరి. ప్రజానాట్య మండలినేతగా రాష్ట్రవ్యాపితంగా అనేక కార్యగోష్ఠులు, కళాజాతాలు నిర్వహించి కళాసూత్రాలను నేర్పి ఎందరినో కళాకారులుగా తీర్చిదిద్దిన ఒజ్జ నల్లూరి. రాష్ట్ర వ్యాపితంగా కళాకారులను సమీకరించి ప్రభుత్వంపై పోరాడి కళాకారులకు పెన్షన్‌ సౌకర్యం సాధించటంలో ప్రధానపాత్ర నల్లూరిది. రాష్ట్ర ప్రభుత్వానికి సాంస్కృతిక విధానం ఉండాలని, ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాపితంగా పలు కార్యక్రమాలను ప్రజానాట్యమండలి ద్వారా నిర్వహించారు. ఆ కృషిని ఇప్పటికీ కొనసాగి స్తున్నారు. గుప్పెడు చలనచిత్రాలలో కూడా నటించి రాణించి చలనచిత్రరంగ చలన సూత్రా లను తెలుసుకొని విజ్ఞానానికి, వినోదానికి దూరమైన ఆ రంగానికి కావాలని దూరమైన ఆదర్శ కళాకారుడు నల్లూరి.

అభ్యుదయ రచయిత ఈమని దయానంద దగ్గర హిందీని అభ్యసించి హిందీ మాష్టారుగా కొద్దికాలం పనిచేసి మానేసి సాంస్కృతికోద్యమానికే అంకితమైన రెడ్‌స్టార్‌ నల్లూరి. ఈ విశాల విశ్వాన్నే విద్యాలయంగా మార్చుకొని అవిశ్రాంత కళాయాత్ర కొనసాగిస్తున్న నల్లూరి అనేకానేక ప్రజా, ప్రభుత్వ సత్కారాలను స్వీకరించారు. స్వంత ఆస్తిమీద మమకారంలేని ఈ కమ్యూనిస్టు తనకు లభించిన నగదు పురస్కారాలలో ఒక్కపైసాను కూడా తన స్వంతానికి వాడుకోకుండా ట్రస్ట్‌ను నెలకొల్పి ప్రజాసాంస్కృతికోద్యమానికే తిరిగి ఖర్చుపెడుతున్న కళాజీవి.

ప్రజానాట్యమండలి నిర్మాతగా, కమ్యూనిస్టు పార్టీ నేతగా స్ఫూర్తిమంతమైన జీవితాన్ని గడుపుతున్న తెలుగు వారి అన్న సాంస్కృతిక దీపధారి నల్లూరి.

'కళాకారుడు మానవ హృదయనిర్మాత' అన్న గోర్కీ మాటకు ప్రత్యక్షరూపం. 'ప్రేమనిచ్చిన, ప్రేమ వచ్చును - ప్రేమనిలిపిన ప్రేమ నిలుచును' ప్రేమించటం మాత్రమే తెలిసిన మన కాలపు ప్రేమమూర్తి నల్లూరి వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు.

(ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాల సందర్భంగా రాజమండ్రిలో ది. 30-5-2015న ఎన్టీఆర్‌ రంగస్థల పురస్కారాన్ని అందిస్తున్నారు.

6-6-2015న 'అన్న' జన్మదినం)


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు