తాగునీటి పేరుతో రోగాల పంపిణీ

Sun, 20 Mar 2016, IST    vv
తాగునీటి పేరుతో రోగాల పంపిణీ

(విశాలాంధ్ర బ్యూరో, ఏలూరు)

పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఆర్‌ఓ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని త్రాగడం ప్రారంభించిన తరువాత అక్రమ మంచినీటి వ్యాపారం జోరుగా సాగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో వందల సంఖ్యలో నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. నెలకు నీటి వ్యాపారులు 4 కోట్ల రూపాయలకు పైగా జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండి దండుకుంటున్నారు. ప్రజలకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నారు. 'విశాలాంధ్ర బ్యూరో' చేసిన ఒక పరిశీలనలో జిల్లాలో 1950 పైగా అనుమతి లేని నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. అన్ని అనుమతులు ఉన్న ప్లాంట్లు 12 మాత్రమే ఉన్నాయని పరిశీలనలో వెల్లడైంది. ఒక చిన్న గది నిర్మించి, దాంట్లో రెండు లక్షల రూపాయల లోపు మాత్రమే ఖర్చు చేసి లెక్కకుమిక్కిలిగా నీటి శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసి నీటిని అమ్ముకుంటున్నారు. 20 లీటర్ల నీటి డబ్బాను 8 నుంచి 10 రూపాయలు అమ్ముతూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. త్రాగునీటి శుద్ధి ప్లాంట్‌ నిర్మించి వ్యాపారం చేసే వాళ్లు భారతీయ ప్రమాణాల బ్యూరో, ఐఎస్‌ఐ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఈ రెండు సంస్ధలు నియమ నిబంధనలు పరిశీలించి సర్టిఫికెట్లు ఇస్తాయి. ఇలాంటి సర్టిఫికెట్లు ఉన్న ప్లాంట్లు జిల్లాలో కేవలం 12 మాత్రమే కనబడుతున్నాయి. ఎట్టి గుర్తింపు, అనుమతులు లేకుండా 1950కి పైగా నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. ఐఎస్‌ఐ గుర్తింపు పొంది ప్లాంట్లు ఏర్పాటు చేసిన తరువాత ప్రతీ మూడు నెలలకు సంస్ధ ఉన్నతాదికారులు పరిశీలన జరుపుతారు. ఈ ఉన్నత స్ధాయి అధికారులు సరఫరా చేస్తున్న నీటిని పరీక్షించి సూచనలు, సలహాలు అందజేస్తారు. ఆ సమయంలో శుభ్రతలేని నీటి వ్యాపారులు చేస్తున్న గుర్తిస్తే ప్లాంట్ల లైసెన్సును రద్దు చేస్తారు. ఐఎస్‌ఐ సర్టిఫికెట్‌ పొందాలంటే 10 లక్షలకు పైగే ఖర్చవుతుంది. ఏటా రెన్యూవల్‌కు రెండు లక్షల దాకా ఖర్చవుతుంది. అదే స్వచ్ఛంద సంస్ధలు, ట్రస్టుల పేరుతో నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే అసలు తనిఖీలు ఉండవు. రెన్యువల్‌ ఛార్జీలు ఉండవు. ఈ ప్లాంట్ల నుండి సరఫరా అయ్యే నీటికి ఎవరి పర్యవేక్షణ ఉండదు. లక్ష నుండి రెండు లక్షల లోపు ఖర్చు పెడితే మార్కెట్‌లో వాటర్‌ ఫిల్టర్‌, ప్లాంట్‌ మిషన్‌ దొరకుతాయి. అప్పటి నుంచి కోట్లలో నీటి వ్యాపారం చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి. శుద్ధి జలాలు సరఫరా చేయకపోవడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత ప్రమాణాల బ్యూరో, ఐఎస్‌ఐ అనుమతి పొందిన నీటి శుద్ధి కేంద్రాలపైనే జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖకు తనిఖీ చేసే అధికారం ఉంటుంది. ట్రస్టులు, స్వచ్ఛంద సంస్ధల పేరుతో ఏర్పాటైన ప్లాంటలన్నీ అనుమతులు లేనివే. ఇటువంటి సంస్ధలు చేస్తున్న నీటి వ్యాపారం అక్రమమైనవేనని భావించాలి. వాళ్లు విక్రయించే నీరు సురక్షితం కాదు. ఇట్టి సంస్ధలపై ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేస్తామని ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు చెబుతారు కానీ అ మాటలు నీటి మూటలే. ప్లాంట్లు ఏర్పాటు చేసే వారు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ప్లాంటు నిర్మాణంలో భాగంగా బోరు వేయాలంటే వాల్టా చట్టప్రకారం అనుమతి కావాలి. లేకపోతే లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. ఆర్‌ఓ ప్లాంట్‌ బోర్లకు వాల్టా చట్టం అనుమతి ఉన్నట్లు కనబడదు. అపరివుభ్ర వాతావరనంలో లెక్కకుమిక్కిలిగా ఉన్న ఈ ప్లాంట్లలో నీటిని తయారు చేస్తున్నారు. వాటర్‌ క్యాన్లను సక్రమంగా శుభ్రం చేయడం లేదు. క్యాన్ల మీద బ్యాచ్‌ నెంబర్లు, తయారీ కేంద్రాల చిరునామాలను కూడా చాలా సందర్భాల్లో ప్రచురించడం లేదు. ఇలా ఇంకా అనేక నిబంధనలకు కొందరు తిలోదకాలు ఇస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నీటి నమూనాలను పరీక్షలకు పంపడం లేదు. త్రాగునీరు మంచివా? కాదా? అని నిర్ధారించుకునేందుకు నీటి క్విట్లు అందుబాటులో ఉన్నాయి. స్ధానిక సంస్ధలతో పాటు బహిరంగ మార్కెంట్‌ ఇవి లభ్యమవుతున్నాయి. వీటిని సుమారు 2 వేలు చెల్లించి కొనుగోలు చేస్తే ఈ క్విట్ల వినియోగం ద్వారా అపరిశుభ్ర నీటిని గుర్తించవచు. ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


Share Email Print

జిల్లా వార్తలు

ప్రాంతీయ వార్తలు లో మరికొన్ని

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు