మాల్యా, లలిత్‌మోడీ సంగతేంటి?

Thu, 31 Mar 2016, IST    vv
మాల్యా, లలిత్‌మోడీ సంగతేంటి?

దిగ్బోరు(అసోం) : విదేశాల నుంచి నల్లడబ్బును వెనక్కి తీసుకురావడం గురించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతు న్నారు. మరి లిక్కర్‌ డాన్‌ విజరుమాల్యా, ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌మోడీ ఇంకా విదేశాల్లోనే ఎందుకున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూటిగా ప్రశ్నించారు. అసోం ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ గురువారం ప్రసంగించారు. బ్లాక్‌మనీని విదేశాల నుంచి వెనక్కి తీసుకొచ్చి ప్రతి భారతీయుని బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోడీ పదేపదే చెప్పారు. ఆచరణలో చేసి చూపించలేదని రాహుల్‌ విమర్శించారు. విదేశాల నుంచి బ్లాక్‌మనీ కన్నా విదేశాల్లో తలదాచుకుంటున్న విజరుమాల్యా, లలిత్‌ మోడీని వెనక్కి తీసుకురావాలని మోడీకి సవాల్‌ విసిరారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. ఇకవైనా బీజేపీ వాస్తవాలు మాట్లాడాలని డిమాండు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారమిస్తే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌)తో కలసి అసోం చరిత్ర, సంస్కృతిని మార్చేస్తుందని రాహుల్‌ విమర్శించారు. బీజేపీకి బీహారు ఎన్నికల రుచిని చూపించాలని అసోం ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తద్వారా బీజేపీ ప్రమాదకరమైన ఆలోచనలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 4, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నల్లకుబేరులను పవిత్రులుగా మార్చే పథకాన్ని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారని, ఇదో క్షమాభిక్ష పథకమని చెప్పారు. అసోంలో మోడీ పెద్దపెద్ద ప్రసంగాలు చేశారు. కానీ మాల్యా, లలిత్‌మోడీల గురించి కనీసం ప్రస్తావించలేదు. దీనికిబదులుగా ఫెయిర్‌ అండ్‌ లవ్లీ పథకం ప్రకటించారు. బీజేపీ నాయకులు చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించారు. బ్లాక్‌మనీకి సంబంధించి మోడీ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష పథకం వల్ల దేశంలోని గ్యాంగ్‌స్టర్లు, మిలిటెంట్లు, నేరస్తులు తమ బ్లాక్‌మనీని తెల్లగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడిందని ప్రజలకు వివరించారు. కొద్దిమేరకు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తే నల్లడబ్బంతా తెల్లగా మారుతుందన్నారు. మోడీ ఇక్కడికొచ్చి అభివృద్ధి గురించి చెప్పారు. మోడీ చెప్పిన అభివృద్ధి ఒక పౌరుడు మరో పౌరుడిపై పోరాటం చేయడమేనా అని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రజలతోనే ఉందని, ప్రజల కోసమే పనిచేస్తోందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య తేడా ఇదేనన్నారు. 15 ఏళ్లకు ముందు నాటి పరిస్థితులను బీజేపీ-ఏజీపీ తీసుకొస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉంచిందని చెప్పారు. రాష్ట్రంపై ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని రుద్దేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. బీజేపీని ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తుందని, బీజేపీ గెలిస్తే అసోంపై ఆర్‌ఎస్‌ఎస్‌ పెత్తనం సాగిస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతిక, భాష, ప్రతిదానిపై ఆర్‌ఎస్‌ఎస్‌ పెత్తనం చేస్తుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందిచ్చిన హామీలన్నింటినీ మోడీ అమలు చేయడం లేదన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

ప్రాంతీయ వార్తలు లో మరికొన్ని

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు