ఢిల్లీయే బాద్షా

Sat, 30 Apr 2016, IST    vv
ఢిల్లీయే బాద్షా

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ 9వ అడిషన్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ నైట్‌రైడర్స్‌పై ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ విజయం సాధించింది. యువ బ్యాట్స్‌మెన్‌ కారుణ్‌ నాయర్‌, అరంగేట్రం మ్యాచ్‌ ఆడిన సామ్‌ బిల్లింగ్స్‌లు తమ చురుకైన బ్యాటింగ్‌తోను, జహీర్‌, బ్రాత్‌ వెయిట్‌ బౌలింగ్‌లో రాణించడంతో ఢిల్లీ గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. టాస్‌ గెలిచిన నైట్‌ రైడర్స్‌ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఢిల్లీ మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్‌లో నాయర్‌, బిల్లింగ్స్‌ రాణించడంతో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ నాయర్‌ (50 బంతుల్లో ఒక సిక్స్‌, తొమ్మిది ఫోర్లతో 68), బిల్లింగ్స్‌ (34 బంతుల్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 54) అర్ధ సెంచరీలు చేశారు. ముచ్చటైన షాట్లతో ఇద్దరూ అలరించారు. మరో బ్యాట్స్‌మెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వెయిట్‌ 11 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మరోసారి హిట్టింగ్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. శ్రేయా అయ్యర్‌, క్రిస్‌ మోరిస్‌ డక్‌ ఔట్‌లు, క్వింటన్‌ డికాక్‌ 1, రిషబ్‌ పంత్‌ 4 పరుగులతో విఫలమవ్వగా, సంజా సామ్‌సన్‌ 15 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ 186 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్‌ జట్టులో ఆండ్రూ రస్సెల్‌, ఉమేష్‌ యాదవ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, సునీల్‌ నరైన్‌ 1 వికెట్‌ తీసుకున్నాడు. అనంతరం 187 పరుగుల లక్ష్యంతో ఛేదనను ప్రారంభించిన నైట్‌ రైడర్స్‌ జట్టులో రాబిత్‌ ఊతప్ప (52 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 72) మిగిలిన బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా పోరాడలేదు. గౌతం గంభీర్‌ 6, పీయూష్‌ చావ్లా 8, యూసఫ్‌ పటాన్‌ 10, రాజగోపాల్‌ సతీష్‌ 6, ఉమేష్‌ యాదవ్‌ 2, సునీల్‌ నరైన్‌ 4 పరుగులతో నిరాశపరిచారు. సూర్య కుమార్‌ యాదవ్‌ 21, రస్సెల్‌ 17 పర్వాలేదనిపించారు. దీంతో 27 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. జహీర్‌ఖాన్‌ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బతీశాడు. గౌతం గంభీర్‌, పీయూష్‌ చావ్లాను ఔట్‌ చేశాడు. నైట్‌రైడర్స్‌ పవర్‌ ప్లే సమయంలో ఓ కుక్క గ్రౌండ్‌లోకి వచ్చి బయటికి వెళ్లే దారికోసం తంటాలు పడడం కొద్దిసేపు అభిమానులకు వినోదం కలిగించింది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు