గడువులోగా పోలవరం పూర్తిచేస్తాం

Sat, 30 Apr 2016, IST    vv
గడువులోగా పోలవరం పూర్తిచేస్తాం

విశాలాంధ్ర బ్యూరో- విజయవాడ : పోలవరం పనులు ఆగే ప్రసక్తే లేదని, మంత్రి దేవినేని ఉమామహే శ్వరరావు స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంటులో కేంద్రమంత్రి ఉమాభారతి కూడా ప్రాజెక్టుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, దానికనుగుణంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఆయన శనివారం జన వనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్సిట్‌ కంపెనీ నిర్వహిస్తుందని, గడువులోగా ప్రాజెక్టు పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటిమట్టం 5 అడుగులకు పడిపోయినందున కృష్ణా బోర్డు తక్షణమే ఈప్రాంత తాగునీటి అవసరాల నిమిత్తం 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణా రివర్‌బోర్డును కోరామని తెలిపారు. వర్షాకాలం నాటికి పులిచింతల ప్రాజెక్టులో 30 నుండి 40 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ప్రయత్నిస్తున్నామని, దీనిలో భాగంగా ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి తెలంగాణా మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇంకుడుగుంతల కార్యక్రమం మహోద్యమంలా సాగుతుందని, ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. నీరు-ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటివరకు 7 జిల్లాల్లో పర్యటనలు ముగించినట్లు వెల్లడించారు. ప్రతి ఇంటిలో, పొలంలో ఇంకుడుగుంట నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐదు ఎకరాలలోపు పొలం కల్గిన రైతులు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవచ్చని, అలాగే 5 ఎకరాలు పైబడిన రైతులు నీరు-చెట్టు కార్యక్రమం నిధులను సద్వినియోగం చేసుకోవచ్చునని సూచించారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్ర్రంగా మార్చాలంటే జల వనరులను వృద్ధి చేసుకోవాలని, ఇందుకు ఇంకుడు గుంతలు దోహదపడతాయన్నారు. వీటితోపాటు రాష్ట్రంలో వున్న 40లక్షల చెరువుల్లో పూడికతీత పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, ప్రజలంతా ప్రభుత్వం చేపట్టే ఈకార్యక్రమాలకు సహకరించాలని మంత్రి ఉమా కోరారు.


Share Email Print

జిల్లా వార్తలు

రాష్ట్ర వార్తలు లో మరికొన్ని

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు